Category : వ్యాపారం | Sub Category : జాతీయ Posted on 2025-03-18 13:06:08
తెలుగు వెబ్ మీడియా న్యూస్:మెరుగైన వైద్య సదుపాయాలున్నా, అక్షరాస్యత పెరిగినా, జననీ సురక్ష యోజనతో ప్రభుత్వం నిధులు అధికంగానే ఖర్చు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో కాన్పులు జరుగుతున్న తీరు చాలా ఆందోళన కలిగిస్తోంది. సిజేరియన్లలో నిరుడు జాతీయ సగటు 21.5 శాతం నమోదవగా, తెలంగాణ 60.7 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు : ఇందుకు ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం, గర్భిణులు బలహీనంగా ఉండటం, ముహూర్తాలపై నమ్మకం ఇంకా ఎక్కువగా పెరగడం కారణాలుగా తెలుస్తోంది. జాతీయ ఆరోగ్య సంస్థలు, వైద్య జర్నల్స్ నివేదికల (2024) ప్రకారం అతి తక్కువ సిజేరియన్ జరిగే రాష్ట్రాల్లో తొలి మూడు స్థానాల్లో నాగాలాండ్ (5.2%), మేఘాలయ (8.2%), బిహార్ (9.7%) నిలవడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ డెలివరీలు అధికంగా జరుగుతున్నాయి.
జిల్లాల వారీగా భయపెడుతున్న లెక్కలు : మహబూబాబాద్ జిల్లాలో ప్రైవేటులో జరిగిన 4,100 కాన్పుల్లో 9.8 శాతమే సాధారణం కాగా, మిగితావి మొత్తం సిజేరియన్లే. యాదాద్రి-భువనగిరి జిల్లాలో ప్రైవేటులో జరిగిన 8,651 ప్రసవాల్లో 1,238 అంటే 14.31 శాతమే సాధారణ ప్రసవాలు జరిగాయి. సిరిసిల్లలో 90%, నిజామాబాద్‌లో 88%, ఆదిలాబాద్‌లో 86%, నల్గొండలో 82%, సూర్యాపేటలో 82%, నిర్మల్‌లో 81%, జగిత్యాలలో 81% కాన్పుల్లో సిజేరియన్లే ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ గణాంకాలను గమనిస్తే ఒకట్రెండు జిల్లాలు మినహా మిగతావన్నీ కూడా 50 శాతంలోపే ఉండటం గమనార్హం. మొత్తంగా తెలంగాణలో నమోదవుతున్న 60.7 శాతం శస్త్రచికిత్సల్లో ప్రైవేటులో 47 శాతం, సర్కారు ఆసుపత్రుల్లో 14 శాతం ఉండటం గమనార్హం. ఇంత తేడా ఉండటం ఏంటని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
అక్కడ 72 గంటలపాటు వేచి చూస్తారు : బిడ్డ బరువు 3.5 కిలోల కంటే ఎక్కువుంటే, పెల్విస్ ఎముక పరిమాణం అనుకూలంగా లేకుంటే, గర్భంలో కవలలు ఉన్నప్పుడు, గర్భిణికి రక్తపోటు పెరిగినప్పుడు, మధుమేహం సాధారణ స్థాయిని మించినప్పుడు, గుండె సంబంధమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ ఆపరేషన్ చేయాలి. గర్భిణీ ఆరోగ్యంగా ఉంటే సాధారణ ప్రసవం అయ్యేవరకు వేచి చూడాల్సిన అవసరముంది. అమెరికా, యూకేలలోని ప్రజలు సాధారణ ప్రసవాల కోసం ఏకంగా 72 గంటల పాటు వేచి చూస్తారు. అందుకే అక్కడ సిజేరియన్లు చాలా తక్కువ నమోదవుతుంటాయి. మన దగ్గర ఇటీవల కొందరు తిథులు, ముహూర్తాలు చూసుకొని సిజేరియన్‌కు సిద్ధమవుతుండటం చూసి ఈ ఏఐ కాలంలో ఇదేంటని నివ్వెరపోతున్నారు.సిజేరియన్ ఆపరేషన్ సమయంలో గర్భిణికిచ్చే మత్తుమందు కారణంగా ఆమెకు భవిష్యత్తులో నడుము నొప్పి సమస్య వస్తుంది. గర్భ సంచి తీవ్రంగా బలహీనపడుతుంది. దానికి పక్కనే ఉండే పేగులు అతుక్కుపోయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భం దాల్చిన తర్వాత అది తినొద్దు, ఇది తినొద్దనే అపోహలు పెంచుకోవడం, మానసికంగా, శారీరకంగా బలంగా లేకపోవడం, ఏమాత్రం వ్యాయామం చేయకపోవడం ఎక్కువగా సిజేరియన్లకు ఆస్కారమవుతుంది.
పర్యవేక్షణ, తనిఖీలు లేకనే : మానిటరింగ్, తనిఖీలు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్స్‌ను అధికంగా చేస్తున్నారు. మామూలు హాస్పిటళ్లలోనూ ఒక్కో కాన్పునకు కనిష్ఠంగా రూ.50 వేల వరకు బిల్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి ప్రైవేట్ దవాఖానాల్లో జరిగే సాధారణ, సిజేరియన్ల సంఖ్యను గతంలో నమోదు చేయించారు. అదుపు తప్పిన ఆసుపత్రులకు కలెక్టర్లు సైతం నోటీసులు ఇచ్చేవారు. కొన్నాళ్లుగా పర్యవేక్షణ లేక వైద్యంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.