Category : వ్యాపారం | Sub Category : ఆంధ్రప్రదేశ్ Posted on 2025-03-18 13:03:27
తెలుగు వెబ్ మీడియా న్యూస్:శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన కోటా టికెట్లను ఇవాళ ఉదయం ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసింది. వీటి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేయనున్నారు. అలాగే ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంచనుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం పది గంటలకు రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మరిన్ని వివరాలకు భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని టీటీడీ తెలిపింది.
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం : శ్రీవారి సర్వదర్శనానికి నేడు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. సోమవారం శ్రీవారిని 70,824 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో శ్రీవారికి తలనీలాలను 25,674 మంది భక్తులు సమర్పించుకున్నారు. సోమవారం (నిన్న) శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా ఉంది.