Category : | Sub Category : క్రీడా Posted on 2024-01-02 06:38:40
రెండో టెస్టు కోసం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముమ్మర ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. న్యూ ఇయర్ రోజునూ వదలకుండా నెట్స్‌లో గంటపాటు చెమటోడ్చాడు. ఆరంభంలో సెంట్రల్ నెట్స్‌లో బౌలర్లను ఎదుర్కోగా, తర్వాత అవుట్ సైడ్ నెట్స్‌లో అర్ధగంట పాటు వేగంగా వచ్చే త్రోడౌన్స్‌ను ఆడాడు. ముఖ్యంగా లెఫ్టామ్ పేసర్ బౌలింగ్‌లో ఎక్కువ సేపు బ్యాటింగ్ సాధన చేశాడు. భారత జట్టులో ఇలాంటి బౌలర్ లేకపోవడంతో స్థానిక బౌలర్ చేత బంతులను వేయించుకున్నాడు. దక్షిణాఫ్రికా ఎడమచేతి పేసర్ బర్గర్‌ను దృష్టిలో ఉంచుకునే తను ఈ ప్రాక్టీస్ సాగించాడు. ఇక శ్రేయాస్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే బలహీనత తొలి టెస్టులోనూ కనిపించింది. అలాగే నెట్స్‌లో త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ సెనెవిరత్నె వేసిన బంతులను కూడా సరిగా ఆడలేకపోయాడు. ఇందులో ఓ బంతిని పుల్ షాట్ ఆడేందుకు చూడగా, అది పొట్టను తాకడంతో కాసేపు ప్రాక్టీస్ కూడా ఆపాల్సి వచ్చింది.
మరో బౌన్సీ ట్రాక్ ఖాయమేనా?: తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టులో విజయం కోసం చూస్తోంది. కానీ పచ్చికతో కళకళలాడుతున్న ఇక్కడి పిచ్ కూడా పేసర్లకు అనుకూలించేలా ఉంది. దీంతో స్వింగ్, బౌన్స్‌తో బెంబేలెత్తించేందుకు ఆతిథ్య బౌలర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అదే జరిగితే సెంచూరియన్ తరహాలోనే భారత బ్యాటర్లకు కష్టాలు ఎదురైనట్టే. అయితే చివరి రెండు రోజులు వికెట్ స్పిన్నర్లకు మద్దతుగా నిలిచే అవకాశముంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ను ఎంచుకుంటే మేలని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో భారత్ ఆరు టెస్టులాడినా ఒక్కటీ గెలవలేదు. ఇందులో రెండు డ్రాగా ముగిశాయి.
షారుక్‌ను దాటేసిన కోహ్లీ
న్యూఢిల్లీ: ఆసియాలోనే అత్యధిక పాపులారిటీ కలిగిన వ్యక్తిగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ప్రముఖ వెబ్‌సైట్ వికీపీడియా ప్రకారం.. గడిచిన ఏడాది (2023) ఆసియాలో అత్యధిక మంది విరాట్ గురించిన సమాచారం తెలుసుకోవడానికి తమ వెబ్‌సైట్‌ను సందర్శించినట్టు పేర్కొంది. కోహ్లీ పేజీని కోటీ 7 లక్షలమంది వీక్షించగా.. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ గురించి 77 లక్షల మంది, నటి ప్రియాంక చోప్రా కోసం 65 లక్షల మంది వెతికినట్టు తెలిపింది.