Responsive Header with Date and Time

Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-26 17:51:14


తెలుగు వెబ్ మీడియా న్యూస్: మాజీ సీఎం జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలి. మేం చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటాం. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుంది అని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శ్రీకాకుళంలో పాఠశాల ఆకస్మిక పరిశీలన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ నాణ్యతాలోపంతోపాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో నా దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వచ్చాక.. తితిదేను ప్రక్షాళన చేయాలని ఈఓకు చెప్పాం. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవీ సుబ్బారెడ్డి రూ.150కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారు? తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశాం. విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ నాణ్యత బాగుందని వైకాపా ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారు అని లోకేశ్ తెలిపారు.

జగన్ మాదిరి మేం పారిపోయే వ్యక్తులం కాదు

సూపర్ సిక్స్ పథకాల అమలుపై విలేకరుల ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు. జగన్ లా మేం పారిపోయే వ్యక్తులం, కాదు. ఇప్పటికే పింఛన్లు, మెగా డిఎస్సీ హామీలను అమలు చేశాం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. పథకాల అమలుపై మాకు చిత్తశుద్ధి ఉంది. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. జగన్ లా పరదాలు కట్టుకుని మేం తిరగడంలేదు. తప్పు చేయకపోతే ఎందుకు భయపడ్డారు? ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మధ్య ప్రజావేదిక నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని కేంద్రమంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ప్రైవేటీకరణ లేదని నేను, మా ఎమ్మెల్యేలందరం నిన్న స్పష్టంచేశాం. విశాఖ ఉక్కును బతికించడం కోసం నిధులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి.. కేంద్రాన్ని కోరారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. వైకాపా నాయకులు ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు. ఇటీవల వరదలు సంభవించిన సమయంలో కష్టకాలంలో ఉన్న ప్రజలకు మేం అండగా నిలబడ్డాం. జగన్.. ప్రజాధనంతో రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కున్నారు కానీ, ఏ నాడు జనం ముందుకు వెళ్లడం లేదు. ఎవరు అసలైన ప్రజానాయకులో రాష్ట్రప్రజలకు అర్థమైంది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

రెడ్ బుక్ పని ఇప్పటికే ప్రారంభమైంది..

గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు. వారి హయాంలో ఆయా వర్సిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు. రెడ్ బుక్ పై వస్తున్న విమర్శలకు మంత్రి సమాధానమిస్తూ.. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు ప్రారంభమైంది. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదు. ఇందులో భాగంగా ఐపీఎస్ లు కూడా సస్పెండ్ అయ్యారు. రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్ ఉండాలన్నదే మా ప్రభుత్వ అభిమతం అని తెలిపారు.

విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన వైకాపా ప్రభుత్వం

అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టుపట్టించింది. ఫలితంగా ప్రభుత్వపాఠశాలల్లో 9లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.2500 కోట్లు, గుడ్లు, చిక్కీలకు రూ.200 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారు. అన్నింటినీ తీర్చుకుంటూ వస్తున్నాం. జగన్ ధ్వంసం చేసిన విద్యావ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం బాగుచేస్తాం. అందులో భాగంగానే నేను జిల్లాల పర్యటనకు వెళ్లినపుడు ఒకరోజు పూర్తిగా స్కూళ్ల పరిశీలనకు కేటాయిస్తున్నా. వాస్తవాలను తెలుసుకోవడానికి స్కూళ్లను తనిఖీ చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల మెరుగుదలకు మౌలిక సదుపాయాల కల్పనతోపాటు తల్లిదండ్రులు, టీచర్లు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం వహించాలి. ఇందుకోసం పేరెంట్- టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి నుంచి వార్డు సభ్యుడు వరకు అందరం ఈ సమావేశాలకు హాజరై పాఠశాలల మెరుగుదలకు వారి సలహాలు తీసుకుంటాం. పాతర్లపల్లిలో నిర్మాణంలో ఉన్న నాడు-నేడు స్కూలు గోడకూలి విద్యార్థి మృతిచెందిన ఘటనపై అధికారుల నుంచి నివేదిక కోరాం. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అని లోకేష్ చెప్పారు.





Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: