Responsive Header with Date and Time

Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-26 17:35:30


తెలుగు వెబ్ మీడియా న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా నియమాక ప్రక్రియ చేపట్టకపోవడంతో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు సమాయత్తం అవుతుంది. గత ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలు, ఆర్జీయూకేటీతో కలిపి మొత్తం 3,295 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్‌ రోస్టర్, బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో నిబంధనలు పాటించకపోవడంతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రకటనను రద్దు చేయడమో లేదంటే దాన్ని వెనక్కి తీసుకొని, మరోమారు కొత్త ప్రకటన చేయడమో దిశగా కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి, సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అనంతరం పోస్టుల హేతుబద్ధీకరణను పునఃపరిశీలించనుంది. అలాగే రిజర్వేషన్‌ రోస్టర్‌ విధానంతో కొత్తగా ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఇప్పటికే మంత్రి నారా లోకేశ్‌ హుకూం జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు కూడా. 2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొదటిసారి 1385 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. దీనిని ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్‌ పరీక్షను కూడా నిర్వహించారు. అయితే అప్పట్లో కొందరు అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు దాకలు చేయడంతో.. కోర్టు ఆ ప్రకటనలను రద్దు చేసింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈకేసు అక్కడ పెండింగ్‌లో ఉండగానే ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు 3,295 పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చింది. అయితే ఈ ప్రక్రియ కూడా పూర్తి కాకుండానే అర్ధాంతరంగా ఆగిపోవడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఈ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తుంది.

ఏపీలోని ఎయిడెడ్ టీచర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విద్యాశాఖ ఈ నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. అయితే గతంలో ఈ పోస్టుల భర్తీకి ఒక విధానమంటూ లేకపోవడంతో అడ్డగోలుగా పోస్టులను అమ్ముకున్నారు. ప్రభుత్వం సైతం ఒక విధానమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ అక్రమాలకు అడ్డుకట్టపడటం లేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎస్జీటీ టీచర్లు అధికంగా ఉన్నట్లు విద్యాశాఖ లెక్క తేల్చింది. ఈ నేపథ్యంలో వీరిని అవసరమైన ఎయిడెడ్ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తే సరిపోతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: