Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-09-26 17:02:15
తెలుగు వెబ్ మీడియా న్యూస్: జస్ట్ ఆస్కింగ్.. అంటూ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వివిధ అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. తాజాగా తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటనపైనా ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్టు వైరల్ అయింది. అక్కడి నుంచి ప్రకాష్ రాజ్ వరుసగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్.. అని నిన్న పోస్ట్ చేయగా, గెలిచే ముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్! అని తెలుగులో మరో పోస్ట్ పెట్టారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారు? ఎందుకు పెట్టారు? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రాయశ్చిత దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ పోస్టులపై అసహనం వ్యక్తం చేశారు. సున్నితాంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాశారాజ్ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు.
దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని అన్నారు. ఈ మేరకు వీడియో పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్ గారు.. ఇప్పుడే మీ ప్రెస్మీట్ చూశా. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి అని పేర్కొన్నారు. ఈలోగానే రోజుకో పోస్ట్ చొప్పున ప్రకాష్ రాజ్ పెడుతుండటం గమనార్హం.