Responsive Header with Date and Time

Category : తెలంగాణ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-26 16:24:54


నైపుణ్యాల లేమితోనే నిరుద్యోగం నాసిరకం ఇంజినీరింగ్ కళాశాలలను మూసేస్తాం కొన్ని కాలేజీల్లో అర్హులైన అధ్యాపకులూ లేరు.. పింఛన్లు, పథకాలకు డబ్బులు పంచడంపైనే సర్కారు దృష్టి ఉండొద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ కోర్సును ప్రారంభించిన సీఎం

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మార్గంగా భావించి యువత, విద్యార్థులు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. పదేళ్ల తర్వాత వెనక్కితిరిగి చూసుకుంటే ఇంకా 55 లక్షల నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఉన్నారు. మా ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. మరో రెండు మూడు నెలల్లో 35 వేలు ఇస్తాం.

తెలంగాణ యువత ఉద్యోగాలు, ఉపాధి లేక డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. వాటి విక్రయాల్లోనూ పట్టుబడుతున్నారు. ఇది ఆందోళనకర పరిణామం. పంజాబ్ లో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఆ దుస్థితి రానివ్వం.


తెలుగు వెబ్ మీడియా న్యూస్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలపై దృష్టి పెట్టామని, కనీస విద్యాప్రమాణాలను పాటించని కాలేజీలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో అర్హులైన అధ్యాపకులు లేరని, అలాంటి వాటికి అనుమతులు రద్దు చేయడం తథ్యమని చెప్పారు. బుధవారం హైదరాబాద్ లోని ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) నైపుణ్య శిక్షణ కోర్సును సీఎం ప్రారంభించారు. సంబంధిత రిజిస్ట్రేషన్ పోర్టల ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మాట్లాడారు. బీటెక్ పట్టా తీసుకొని వచ్చినవారికి ప్రాథమికాంశాలు కూడా తెలియడం లేదు. అందుకు కారణం సరైన అధ్యాపకులు లేకపోవడమే. ఇంజినీరింగ్ లో నాణ్యమైన విద్య అందించేందుకే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని అధికారులను ఆదేశించాం. వచ్చే ఏడాది నుంచి ఇంటర్న్షిప్ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానివల్ల ప్రాక్టికల్ పరిజ్ఞానం పెరుగుతుంది. ఐఎస్ బి, ట్రిపుల్ ఐటీ, నల్సార్, జేఎన్టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉండటం వల్ల హైదరాబాద్ నగరం ఎడ్యుకేషన్ హబ్ గా మారింది. నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉంటాయని భావించి బహుళజాతి సంస్థలు నగరానికి వచ్చాయి. ఇటీవల అమెరికాలో పర్యటించినప్పుడు స్టాన్ ఫర్డ్, ఆక్స్ఫర్డ్ వర్సిటీ యాజమాన్యాలను హైదరాబాద్ లో ఆఫ్ క్యాంపస్ లు ఏర్పాటు చేయాలని కోరాం. కొన్ని ప్రపంచస్థాయి విద్యాసంస్థలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఐటీ విప్లవాన్ని మనం ముందుగా అందిపుచ్చుకున్నాం కాబట్టే ఇప్పుడు అందులో అగ్రస్థానంలో ఉన్నాం. అలాగే నైపుణ్య విప్లవంలోనూ ముందుండాలి. రాష్ట్రాన్ని స్కిల్ హబ్ మార్చాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే బీఎఫ్ఎస్ఐ కోర్సును ప్రారంభించాం. అమెరికాలో ఇటీవల ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాను కలిశా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివానని ఆయన చెప్పారు. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్ తదితరులు కూడా ఆ స్కూల్ విద్యార్థులే. వారు ప్రపంచస్థాయి సంస్థలను నడిపిస్తున్నారు. డిసెంబరులో హైదరాబాద్ కు రానున్నారు.

2 లక్షల ఉద్యోగాలిచ్చినా సమస్య తీరదు

రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చినా నిరుద్యోగ సమస్య తీరదు. యువతలో ప్రతిభ ఉన్నా ఉద్యోగ నైపుణ్యాలు లేకపోతే కొలువులు రావు. అందుకే పరిశ్రమల ప్రతినిధులను పిలిచి యువత నుంచి వారేం కోరుకుంటున్నారని అడిగాం. ఆ క్రమంలోనే విద్యార్థుల్లో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉండేలా బీఎఫ్ఎస్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాం. డిగ్రీ పట్టా చేతికొచ్చేలోపు ఉద్యోగాలు దక్కేలా ఇందులో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ దృష్టి కేవలం పింఛన్లు, పథకాల డబ్బులు పంచడం ఒక్కదానిపైనే ఉండరాదు. అదేం గొప్ప విషయం కాదు. యువతలో నైపుణ్యాలు పెంచి సాధికారత వైపు నడిపించడం ముఖ్యం. ఆ బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

యువతలో నైపుణ్యాభివృద్ధికి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు

శ్రీధర్ బాబు

రానున్న కొన్నేళ్లలో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో ఐదు లక్షల మంది శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఏమీ చేయలేదని విమర్శించారు. తాము ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తూ.. మరోవైపు నైపుణ్యాలను పెంపొందిస్తున్నామని చెప్పారు. డిగ్రీ, ఇంజినీరింగ్ తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు పలు బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, బీమా సంస్థలు సంసిద్ధత తెలిపాయన్నారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, ఉపాధ్యక్షులు ఎస్కే మహమూద్, వెంకటరమణ, కార్యదర్శి ఆచార్య శ్రీరాం వెంకటేష్, బీఎఫ్ఎస్ఐ డైరెక్టర్ మమత మాదిరెడ్డి, ఎక్విప్ దేశీ సంస్థ వ్యవస్థాపకుడు హేమంత్ గుప్తా, ప్రతినిధి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

వ్యసనాలకు యువత బానిసలు కావడం ఆందోళనకరం

రాష్ట్రంలో గత పాలకులు గొలుసు దొంగతనాలు, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలనే వృత్తి నైపుణ్యాలని అనుకున్నారు. వ్యసనాలకు యువత బానిసలు కావడం ఆందోళనకరం తెలంగాణలో మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏడాదిలోగా క్రీడా అకాడమీ స్థాపించబోతున్నాం.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: