Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-09-19 18:25:45
తెలుగు వెబ్ మీడియా న్యూస్: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ . ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇటీవల వెల్లడించారు. కానీ, తేదీని ప్రకటించలేదు. సంగీత దర్శకుడు తమన్ తాజా పోస్ట్ ఆ లోటు తీర్చినట్టైంది. వచ్చే వారం నుంచి డిసెంబరు 20 వరకూ ఈవెంట్స్, ప్రచార చిత్రాలుంటాయి. సిద్ధంగా ఉండండి అని అప్డేట్ ఇచ్చారు. దీంతో, రామ్ చరణ్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆ సినిమా డిసెంబరు 20న విడుదల కానుందంటూ కామెంట్స్ రూపంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ తమన్ పోస్ట్ ను రీ పోస్ట్ చేయడం గమనార్హం.
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ గేమ్ ఛేంజర్. చరణ్ ద్విపాత్రాభినయం చేసినట్టు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి శంకర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ తో నా కల నెరవేరుతోంది. కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్ సినిమా వచ్చి చాలా కాలమైంది అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు.