Category : సినిమా | Sub Category : సినిమా Posted on 2024-09-19 18:15:47
తెలుగు వెబ్ మీడియా న్యూస్: కోలీవుడ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కంగువా. శివ దర్శకుడు. భారీస్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చిత్రబృందం గురువారం ఉదయం ప్రకటించింది. నవంబర్ 14న దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనిపై సినీప్రియులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్య మూడు భిన్నమైన లుక్స్ లో కనిపించనున్నారని సమాచారం. దిశాపటానీ కథానాయిక. బాబీ దేవోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు తెర పైకి రాని ఓ కొత్త కాన్సెప్ట్ ఇందులో ఉందని, పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకొస్తుందని సినీవర్గాలు తెలిపాయి. పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినీప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.