Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-18 11:24:35
విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ.3,000 కోట్లు పాత బకాయిలు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి
తెలుగు వెబ్ మీడియా న్యూస్: జగన్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల పేద పిల్లల తల్లిదండ్రులు అప్పులపాలయ్యారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు పెట్టి వెళ్లిపోవడంతో చాలా మంది అప్పులు చేసి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు డబ్బులు ఏనాడూ సకాలంలో ఇవ్వలేదు. ఎన్నికల ముందూ డబ్బులు ఎగ్గొట్టి పేదలపై ఆర్థిక భారం మోపారు. గతంలో ఫీజు రీయంబర్స్మెంట్ మొత్తాలను నేరుగా కళాశాలల ఖాతాల్లో వేసే వారు. జగన్ వచ్చాక ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఆలోచనతో తల్లుల ఖాతాల్లో వేసే విధానం తెచ్చారు. దీంతో కళాశాలకు ప్రభుత్వానికి మధ్య సంబంధం తెగిపోయింది. తల్లుల ఖాతాల్లో జగన్ ఫీజు డబ్బులు వేయకపోయినా.. కళాశాలల యాజమాన్యాల ఒత్తిడి భరించలేక తల్లిదండ్రులు, విద్యార్థులు అప్పులు చేసైనా కడుతూ వస్తున్నారు.
ఫీజులు ఎగ్గొట్టి..
2023-24 విద్యా సంవత్సరంలో 4 త్రైమాసికాలకు ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. ఎన్నికల ముందు ఒక విడత విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అవి కూడా చాలా మంది ఖాతాల్లో పడలేదు. ఎలాగూ తల్లుల ఖాతాల్లో డబ్బు పడిందని ఆ మొత్తం చెల్లించాల్సిందేనని యాజమాన్యాలు అప్పట్లో ఒత్తిడి చేశాయి. ఫీజులు కడితేనే పరీక్షలకు అనుమతిస్తామని డిగ్రీ మూడో ఏడాది, బీటెక్ నాలుగో ఏడాది విద్యార్థులను యాజమాన్యాలు హెచ్చరించడంతో అప్పులు చేసి చెల్లించారు. మిగతా విద్యార్థులు కొంత చెల్లించగా.. మిగతా బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరం(2024-25) మొదలైనందున బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. చెల్లిస్తేనే తరగతులకు రానిస్తామని తిరుపతిలో ఓ యాజమాన్యం నోటీసు బోర్డులో పెట్టింది. వైకాపా హయాంలో చెల్లించాల్సిన విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ.3,480 కోట్ల వరకు ఉన్నాయి.
• వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య తదితర కోర్సులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని చెప్పిన జగన్ ఎప్పుడూ సక్రమంగా ఇవ్వలేదు. ట్రిపుల్ ఐటీ పిల్లలు సొంతంగా మెస్ ఛార్జీలు చెల్లించారు.
• 2020-21 నుంచి పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని నిలిపేసిన జగన్.. అంతకుముందు ప్రవేశాలు పొందిన వారికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు బకాయి పెట్టారు.