Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2024-09-18 11:06:11
ఏపీలో పెట్టుబడులు పెడితే ఇంకెంత లాభం వస్తుందో ఆలోచించండి పునరుత్పాదక ఇంధన వనరుల సదస్సులో ప్రముఖ కంపెనీల సీఈఓల ప్రశంసలు
ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కనీసం నాలుగు గంటల సమయమైనా వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రజంటేషన్ ద్వారా అవన్నీ అరగంటలోనే తెలుసుకున్నాం. అంటే ఈ సదస్సుకు హాజరవడం వల్ల మాకు మూడున్నర గంటల లాభం వచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెడితే ఇంకెంత లాభం వస్తుందో దీన్ని బట్టే అర్థమవుతోంది.
గుజరాత్ లోని గాంధీనగర్ లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులపై సోమవారం నిర్వహించిన సదస్సులో చంద్రబాబు ప్రజంటేషన్ ఇచ్చిన తీరుని పలువురు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు కొనియాడారు. సుమన్ కుమార్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లో మీరు భారీ పెట్టుబడులు పెట్టడానికి కారణమేంటని ఈ సదస్సుకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన వ్యక్తి నన్ను అడిగారు. ఈ రోజు మొత్తంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రజంటేషన్ మాత్రమే ఎంతో సమగ్రంగా ఉంది. ప్రభుత్వ విధానాలు, ఆధునిక టెక్నాలజీ... ఇలా ప్రతి అంశాన్నీ స్పష్టంగా, విపులంగా వివరించారు. ఆయన ప్రజంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది అని కొనియాడారు. సుజ్ఞాన్ సంస్థ సీఈఓ జేపీ చలసాని మాట్లాడుతూ... తాను చంద్రబాబుకు వీరాభిమానినని, గత 40 ఏళ్లుగా ఆయనను అనుసరిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో సింహాద్రి పవర్ ప్రాజెక్టు కోసం తాను పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఇటీవల వరదల సమయంలో బాధితుల్ని ఆదుకునేందుకు, వారిలో భరోసా నింపేందుకు చంద్రబాబు, ఆయన బృందం చేసిన కృషి కార్పొరేట్ సంస్థల సీఈఓలకు కూడా ఒక పాఠం వంటిదని ఆయన కొనియాడారు. అంతకు ముందు చంద్రబాబు ప్రసంగిస్తూ గతంలో విద్యుత్రంగంలో తాను తీసుకొచ్చిన సంస్కరణలు దీర్ఘకాలంలో రాష్ట్రానికి ఎంతో మేలు చేసినా.. 2004 ఎన్నికల్లో తన ఓటమికి కారణమయ్యాయని చెప్పారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగంలో రాబోతున్న విప్లవం ఎప్పటికీ అధికారంలో కొనసాగేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తాయన్న భరోసా ఉంటేనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని, చంద్రబాబు దీర్ఘకాలం అధికారంలో ఉండటం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన తెలిపారు.